Masterpeace: రివ్యూ: మాస్టర్‌పీస్.. నిత్యా మేనన్ నటించిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? – Eenadu
వెబ్‌సిరీస్: మాస్టర్‌పీస్; నటీనటులు: నిత్యా మేనన్, షరఫ్ ఉద్దీన్, రెంజి ఫణిక్కర్, మాలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ; సంగీతం: బిజిబల్; ఛాయాగ్రహణం: అస్లాం కె. పురయిల్; కూర్పు: రియాజ్ కె. బధర్; కథ: ప్రవీణ్ ఎస్; నిర్మాత: మ్యాథ్యూ జార్జ్; ప్రొడక్షన్ డిజైన్, డైరెక్షన్: శ్రీజిత్; ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ+హాట్‌స్టార్.

సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ విరివిగా నటిస్తున్న వారిలో నిత్యా మేనన్ (Nithya Menen) ఒకరు. ఆమె నటించిన ‘కుమారి శ్రీమతి’ సిరీస్ సెప్టెంబరు చివరి వారంలో విడుదలకాగా ‘మాస్టర్‌పీస్’ (Masterpeace) తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి, ‘డిస్నీ+హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో ఆమె ఏ పాత్ర పోషించారు? ఆకట్టుకోగలిగారా, లేదా?అసలు కథేంటి? తెలుసుకుందాం (Masterpeace Evaluation)..
ఇదీ కథ: కేరళలోని కొచ్చికి చెందిన రియా (నిత్యా మేనన్), బినోయ్ (షరఫ్ ఉద్దీన్) (Sharaf U Dheen) ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఓ అపార్ట్‌మెంట్‌లో వేరే కాపురం పెడతారు. అందరు ఆలుమగల్లానే వీరి మధ్య అప్పుడప్పుడు టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న బినోయ్, రియా పేరెంట్స్ అక్కడేదో పెద్ద యుద్ధం జరిగిపోతోందని భావిస్తారు. ఆ తగాదాలకు పరిష్కారం చూపి, వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో తమ పిల్లల నుంచి వారు తెలుసుకున్న షాకింగ్ విషయం ఏంటి? చివరకు వారి ప్రయత్నం ఫలించిందా, లేదా? అన్న కథాంశంతో రూపొందిందీ సిరీస్ (Masterpeace Evaluation).
ఎలా ఉందంటే: కొత్తగా పెళ్లైన దంపతులు, వారి మధ్య గిల్లికజ్జాలు, చివరకు సమస్యలు పరిష్కరించుకుని మునుపటిలా ప్రేమగా ఉండడం.. ఇలాంటి కథలు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. ఎన్నో చిత్రాల్లో కనిపించే ఈ కాన్సెప్టే ‘మాస్టర్‌పీస్’లోనూ కనిపిస్తుంది. అయితే, దాన్ని ఎమోషనల్‌గా కాకుండా వినోదాత్మక ధోరణిలో తెరకెక్కించారు దర్శకుడు శ్రీజిత్. పెళ్లి, పిల్లల విషయంలో ఈతరం వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో బినోయ్, రియా పాత్రల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. కథంతా దాదాపు ఒకే ఇంట్లో, ఆరు పాత్రల మధ్యే తిరుగుతుంది. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన’ అన్న సామెత ఇలాంటి సిరీస్‌లకు సెట్ అవుతుంది. ఎందుకంటే చిన్న కథలను చిన్నగా చెబితేనే బాగుంటుందిగానీ దాన్ని సాగదీసి చెబితే ఆసక్తిగా ఉండదు. ఈ కథను అలానే సాగదీశారు. రియా, బినోయ్ మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న గొడవలు, అదే ఇంట్లో ఉంటూ రియా తల్లిదండ్రులు, ఆమె అత్తామామలు చేసే హంగామా ఓ స్థాయి వరకు ఆకట్టుకుంటుంది. కానీ, ముందుకెళ్లే కొద్దీ రొటీన్ అనిపిస్తుంది. కోడలు తన కొడుకుని గుప్పిట్లో పెట్టుకుందని బినోయ్ తల్లి నోరుపారేసుకోవడం, దానికి రియా కౌంటర్ ఇవ్వడం తదితర సన్నివేశాలు చాలామంది అత్తాకోడళ్లకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇలా బినోయ్ తల్లి పాత్ర, రియా తండ్రి పాత్ర ఫేస్ టు ఫేస్ ఓపెన్ అవుతూ వినోదం పంచగా బినోయ్ తండ్రి, రియా తల్లి పాత్రలు సైలెంట్‌గా ఉంటూనే తమ టైమింగ్‌తో గిలిగింతలు పెడతాయి (Masterpeace Evaluation).

అటు భర్త నచ్చని పనిచేసినప్పుడు, ఇటు తల్లిదండ్రులు, అత్తామామలు ఏమైనా అన్నప్పుడు రియా ఏదో ఒక అంశం గురించి ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడి వారిని కన్‌ఫ్యూజ్‌లో పెట్టడం, చిన్న కుమార్తె వివాహ సంబంధం కోసం రియా తండ్రి ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడే సీన్లకు నవ్వాపుకోవడం కష్టమే. వీటితోపాటు బినోయ్ స్నేహితుడు, విజిలెన్స్ ఆఫీసర్ పాత్రలు మంచి హాస్యాన్ని పంచుతాయి. ఈ క్రమంలో వినిపించే ‘పనసకాయ చూసి కొయ్యి.. లేదంటే కోసుకుంటావ్’లాంటి సంభాషణలు గమ్మత్తుగా అనిపిస్తాయి. కథను ఇలా ఎంటర్‌టైనర్‌గా నడుపుతూ ప్రీ క్లైమాక్స్‌లో కాస్త ఎమోషన్ జోడించారు. కొత్తగా పెళ్లైన దంపతుల మధ్యే కాదు ఎన్నేళ్ల బంధమైనా భార్యాభర్తల మధ్య చిర్రుబుర్రులు ఉంటాయని, భార్య కన్న కలను నిజం చేసేందుకు భర్త సహకరించాలనే సందేశాన్నిచ్చారు. పతాక సన్నివేశం సంతృప్తికరంగా ఉంటుంది. 5 ఎపిసోడ్ల (దాదాపు 35 నిమిషాలు)తో మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగుతోపాటు మరికొన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Masterpieceకు బదులు MasterPeace అని ఎందుకు పెట్టారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది!
ఎవరెలా చేశారంటే: ఆధునిక భావాలు కలిగిన రియా పాత్రలో నిత్యా మేనన్ ఒదిగిపోయారు. షరఫ్ ఉద్దీన్.. బినోయ్‌గా ఆకట్టుకుంటారు. రియా అత్త పాత్ర పోషించిన మాలా పార్వతి కామెడీ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. రియా మామగా రెంజి ఫణిక్కర్, ఆమె తల్లిగా శాంతి కృష్ణ, తండ్రిగా అశోకన్ పరిధి మేరకు నటించారు. నిత్యా మేనన్ మినహా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని వారే. మాలా పార్వతి ఒకట్రెండు తెలుగు డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు (Masterpeace Evaluation).
సాంకేతికంగా ఎలా ఉందంటే: ప్రవీణ్ రాసిన కథను తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను నవ్వించడంలో దర్శకుడు శ్రీజిత్‌కు మంచి మార్కులే పడ్డాయి. బిజిబల్ అందించిన నేపథ్య సంగీతం ఓకే. పురయిల్ సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. సిరీస్ మొత్తం ఓ డిఫరెంట్ థీమ్‌లో నడుస్తుంది. ఈ సిరీస్‌ను ఎడిటర్ రిజాయ్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది (Masterpeace Evaluation).
ఎవరెవరు చూడొచ్చు: పెళ్లి కాని వారు, పెళ్లి అయిన వారు, పెళ్లి చేసుకోబోతున్న వారు.. ఇలా అందరూ చూడదగ్గ సిరీస్ ఇది. వెబ్‌సిరీస్ అనగానే ‘అసభ్య పదజాలం, శృంగార సన్నివేశాలు ఉంటాయి’ అని చాలా మంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అలాంటి వాటికి ఈ సిరీస్ దరిదాపుల్లో ఉండదు. కుటుంబమంతా కలిసి చూడాలి.. హాయిగా నవ్వుకోవాలి అని అనుకుంటే ‘మాస్టర్‌పీస్’ మంచి ఎంపిక(Masterpeace Evaluation).
- బలాలు
- + కామెడీ
- + మాలా పార్వతి నటన
- బలహీనతలు
- – సాగదీత
- – తెలిసిన నటులులేకపోవడం
- చివరిగా: ఈ ‘మాస్టర్‌పీస్’.. నవ్వుల ప్రయాణం(Masterpeace Evaluation).
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Adblock check (Why?)